జేపీఎస్ ల ప్రొబేషన్ కాలం రెండేండ్ల నుంచి ఏడాదికి తగ్గింపు? ..ప్రభుత్వానికి పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదన

జేపీఎస్ ల ప్రొబేషన్ కాలం రెండేండ్ల నుంచి ఏడాదికి తగ్గింపు? ..ప్రభుత్వానికి పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదన

 హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగేండ్ల సర్వీస్ పూర్తిచేసుకుని రెగ్యులరైజ్ అయిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్)ప్రొబేషన్ కాలాన్ని రెండేండ్ల నుంచి ఏడాదికి తగ్గించే అంశంపై కసరత్తు మొదలైంది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ అసోసియేషన్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.

ప్రొబేషన్ పీరియడ్ తగ్గింపుపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖలో నివేదించారు. గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను మూడేండ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించింది. ఆ తర్వాత జీవో 26 ద్వారా ఆ కాలాన్ని మరో ఏడాది పొడిగించడంతో వీరంతా నాలుగేండ్ల పాటు కన్సాలిడేటెడ్ పేపై క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించారు.

వీరి పనితీరు ఆధారంగా ప్రభుత్వం అనంతరం గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించింది. తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం నేరుగా నియమితులైన వారికి రెండేండ్ల ప్రొబేషన్ కాలం ఉంటుంది.

అయితే, తాము ఇప్పటికే నాలుగేండ్ల పాటు నిరంతరాయంగా పనిచేసి గ్రామీణాభివృద్ధి శాఖలో పూర్తి అనుభవం గడించామని, కాబట్టి రెగ్యులరైజేషన్ తర్వాత ఉండాల్సిన రెండేండ్ల ప్రొబేషన్ పీరియడ్‌‌‌‌ను ఏడాదికి తగ్గించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. ఇటీవల వీఆర్ఏల విషయంలో ప్రొబేషన్ కాలాన్ని ఏడాదికి తగ్గించిన తరహాలోనే తమకూ ఆ వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే వేలాది మంది పంచాయతీ కార్యదర్శులకు ప్రయోజనం చేకూరనుంది.